అమరావతి : తమ కూటమి ప్రభుత్వం ప్రధానంగా సాగా నీటి రంగంపై ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2014 -19 మధ్య సాగునీటి రంగానికి రూ. 68 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. గత పాలకులు పోలవరం ప్రాజెక్టు పాలిట శనిలా దాపురించారని ఆరోపించారు. అసమర్థత, నిర్లక్ష్యంతో రూ. 440 కోట్ల విలువైన డయాఫ్రాం వాల్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క దీని కోసం అదనంగా రూ. 1000 కోట్లు ఖర్చయిందని, ఇదంతా రాష్ట్ర ఖజానాకు గండి పడేలా చేసిందన్నారు. అనాలోచిత నిర్ణయం కారణంగా భారీ నష్టం వచ్చిందన్నారు సీఎం. దీనికంతటికి ప్రధాన కారకుడు అప్పటి సీఎం జగన్ రెడ్డి అని ఆరోపించారు. 2027లో పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం అని ప్రకటించారు. పట్టి సీమ ద్వారా కృష్ణాడెల్టాకు గోదావరి నీరిచ్చి, శ్రీశైలం నీటిని సీమకు మళ్లించాం అన్నారు.
పదేళ్లుగా సీమలో కరువు లేకపోవటానికి మా దూరదృష్టే కారణం అని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. నీరుంది కాబట్టే కియా లాంటి పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయన్నారు. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులు ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ పేరుతో నాటకాలు ఆడారని ఆరోపించారు. కర్నూలు జిల్లాకు నీరిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాజోలి బండ, గురు రాఘవేంద్ర, వేదవతి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీరు కర్నూలు జిల్లా ఉపయోగించుకుంటే నీటి సమస్య చాలా వరకూ తీరుతుందన్నారు. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఇది వస్తే 2 వేల మంది చేనేతలకు ఉపాధి లభిస్తుందన్నారు. గాజుల దిన్నె ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం అన్నారు. రూ.138 కోట్లతో ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఎమ్మిగనూరు, ఆదోని మీదుగా రైల్వే లైన్లపై దృష్టి పెడతామన్నారు.
















