న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత సైనికాధికారి ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్బంగా దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ఏడాది ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇవ్వడం జరిగిందన్నారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మరోసారి ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ సిందూర్ కింద ఇప్పటికే కుట్రలకు తగిన రీతిలో సమాధానం ఇచ్చామన్నారు ద్వివేది. ప్రస్తుతం ఇండియా ఆపరేషన్ ను తాత్కాలికంగా నిలిచి వేశామని, కానీ ఈ ఏడాది కూడా పాకిస్తాన్ గీత దాటితే, కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నం చేస్తే ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతుందని ప్రకటించారు ఆర్మీ చీఫ్.
నూతన సంవత్సరం సందర్బంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కింద భారతదేశం తీసుకున్న నిర్ణయాత్మక చర్యను ప్రశంసించారు. గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సైన్యం దశాబ్ద కాలంగా పరివర్తన చెందుతోందని తెలిపారు. ఉమ్మడితనం, స్వావలంబన, ఆవిష్కరణలు భారతదేశ రక్షణ వ్యూహానికి ప్రధాన స్తంభాలుగా ఉన్నాయని స్పష్టం చేశారు. సైన్యాన్ని భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచడానికి స్వదేశీ సాంకేతికతలు, కొత్త ఆలోచనల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు . భారత సైన్యం తరపున, తోటి పౌరులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నానని తెలిపారు.
















