అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిగడ్డల కొరత ఏర్పడింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు నడుం బిగించారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కిలో రూ. 35 చొప్పున ఉల్లిపాయల విక్రయం ప్రారంభించారు. ప్రభుత్వం రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ. 35 ధరకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ రాయితీ ధర ఉల్లిపాయలు మొదట విజయవాడలోని అన్ని రైతు బజార్లలో అందుబాటులో ఉంటాయి. ప్రజలు తమ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును చూపించి నెలకు ఒక కుటుంబానికి రెండు కిలోల చొప్పున ఉల్లిపాయలను కొనుగోలు చేయవచ్చు అని ప్రకటంచింది సర్కార్. ప్రజల డిమాండ్ మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో ఈ రాయితీ ధరతో ఉల్లిపాయల విక్రయాలు చేపట్టనున్నారు. ఉల్లిపాయల ధరల భారాన్ని ప్రజలపై తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు , పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించు కోవాలని మంత్రులు కోరారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యులపై అదనపు భారాన్ని మోపుతుందా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఉల్లిపాయల ధరల నుండి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం రాయితీ ధరకు ఉల్లిపాయలను అందించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధర కిలోకు రూ. 60 నుండి రూ. 70 వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, రైతు బజార్ల ద్వారా కిలో రూ. 35 రాయితీ ధరకు ఉల్లిపాయలను అందిస్తున్నామన్నారు మంత్రులు. ఇతర నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి కూడా త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బియ్యం ధరల పెరుగుదలకు ప్రతిస్పందనగా, ప్రత్యేక కౌంటర్ల ద్వారా బిపిటి సూపర్ ఫైన్ బియ్యాన్ని రూ. 52.50 ధరకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మీ మార్ట్స్’ పేరుతో ప్రత్యేక దుకాణాలను ప్రారంభిస్తోంది.

















