పాద‌యాత్ర‌లు చేస్తే వైఎస్ఆర్ వార‌సులు కాలేరు

ప‌రోక్షంగా జ‌గ‌న్ రెడ్డిపై ష‌ర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్

hellotelugu-YSSharmila

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం త‌న సార‌థ్యంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ , ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు, నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా ష‌ర్మిలా రెడ్డి ప్ర‌సంగించారు. పాదయాత్రలు చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కి వారసులు కాలేర‌న్నారు. ఆయ‌న పేరు చెప్పి ప్యాలెస్ లు క‌ట్టుకున్నార‌ని, రాష్ట్రాన్ని అందినంత మేర దోచుకు తిన్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న తండ్రి వార‌స‌త్వం అంటే ఇంట్లో కూర్చొని బ‌ట‌న్ నొక్క‌డం కాద‌న్నారు. జగన్ , చంద్రబాబు కలిసి రాష్ట్ర అభివృద్ధిని బ్రష్టు పట్టించారని మండిప‌డ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. పెట్రోల్ పై వ్యాట్ భారాన్ని మోపిన వాళ్ళు ధర్నాలు చేయడానికి సిగ్గుండాల‌ని అన్నారు. ప్ర‌ధానికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం దారుణ‌మ‌న్నారు. త‌న కారణంగానే ఇవాళ దేశం ఆర్థిక సంక్షోభం దిశ‌గా అడుగులు వేస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే ఆయిల్ ధ‌ర‌లు అట‌కెక్కాయ‌ని, దీనికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారంటూ ప్ర‌శ్నించారు.

వైఎస్సార్ ప్ర‌వేశ పెట్టిన ప్ర‌జా ప‌థ‌కాల‌ను ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నార‌ని, ఇది త‌న తండ్రికి దక్కిన గౌర‌వం అన్నారు. ⁠ఇతర పార్టీల ఐడియాలజీకి , కాంగ్రెస్ ఐడియాలజీకి చాలా భిన్నం అన్నారు ష‌ర్మిలా రెడ్డి.
రాష్ట్ర ప్రజలు మళ్లీ కాంగ్రెస్ ఐడియాలజీ కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో , రాష్ట్రంలో రాజ్యాంగం బ్రతికి ఉండాలి అంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలో రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ⁠దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలన్నారు. వైఎస్ఆర్ రాహుల్ గాంధీని పీఎం చేయాల‌ని కోరుకున్నార‌ని అన్నారు. త‌న తండ్రి కలను నిజం చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. విభజన తర్వాత ఆంధ్రరాష్ట్రం చితికి పోయిందని ఆవేద‌న వ్యక్తం చేశారు. మళ్లీ రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు. త‌న తండ్రి బ‌తికి వుంటే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ఉండేది కాద‌న్నారు. ఆంధ్ర కు అన్యాయం చేయాలని విభజన చేయ లేద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి.

Exit mobile version