హైదరాబాద్ : బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలతో భారతీయ సినిమా చరిత్రలో కొత్త చరిత్రను సృష్టించాడు దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న. తాజాగా తాను ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో కలిసి వారణాసి సినిమా తీశాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు కీలక అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నాడు జక్కన్న. ఇండియాలో ఏ సినిమాకు చేయనంత ఖర్చు వారణాసి కోసం ఖర్చు పెట్టినట్లు పెద్ద ఎత్తున టాక్. ఇక తాజాగా రాజమౌళి గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే తనకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినట్లు జక్కన్ననే బయట పెట్టాడు.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ దర్శకుడు ‘ఆర్ఆర్ఆర్’ విజయం తర్వాత తనకు హాలీవుడ్ నుండి పలు ఆఫర్లు వచ్చాయని ధ్రువీకరించాడు. దీంతో ఆయన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. బ్రెజిల్లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాజమౌళి తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడారు. ప్రస్తుతం తాను తన తదుపరి చిత్రం ‘వారణాసి’ పనిలో నిమగ్నమై ఉండటంతో, ఆ హాలీవుడ్ ఆఫర్లను అంగీకరించలేక పోయానని ఆయన వివరించారు.
ఒకేసారి ఒక సినిమాపైనే దృష్టి పెట్టడం తనకు ఇష్టమని, ఒకే సమయంలో పలు ప్రాజెక్టులను నిర్వహించడం తన పని శైలి కాదని రాజమౌళి పేర్కొన్నారు. కొన్ని హాలీవుడ్ ఆఫర్లు ఇంకా అందుబాటులోనే ఉన్నాయని ఆయన చెప్పాడు. ‘వారణాసి’ చిత్రీకరణ పూర్తయ్యాక వాటి గురించి ఆలోచిస్తానని తెలిపాడు. హాలీవుడ్లో పని చేయాలనే ఆసక్తిని కూడా రాజమౌళి వ్యక్తం చేశారు. అక్కడి చిత్ర నిర్మాణ పద్ధతులు, సాంకేతికతల నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, ఆయన తదుపరి ప్రాజెక్ట్ అంతర్జాతీయ చిత్రంగా ఉండవచ్చనే ఆసక్తిని పెంచాయి. అయితే, ఇప్పటివరకు ఎటువంటి హాలీవుడ్ ప్రాజెక్టును ఆయన అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కథానాయకుడిగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తన భారీ పరిధి , అంతర్జాతీయ ప్రణాళికల కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో నటిస్తుండగా, ఆయన శ్రీరాముడి పాత్రలో కూడా కనిపిస్తారని సమాచారం.
ఎస్.ఎస్. కార్తికేయ , కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందిన సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని సుమారు 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు; ఇది వారి అంతర్జాతీయ లక్ష్యాలకు నిదర్శనం. చిత్ర షూటింగ్ షెడ్యూల్ గురించి కూడా రాజమౌళి అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావడానికి మరో 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. రాజమౌళి , మహేష్ బాబులను ఒకచోట చేరుస్తున్న ఈ ప్రాజెక్ట్, అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాబోయే చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
















