చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై సోషల్ మీడియా వేదికగా అభ్యంతకరమైన పోస్ట్ చేయడం కలకలం రేపింది. దీంతో చెన్నై నగర సైబర్ క్రైమ్ పోలీసులు 35 ఏళ్ల ఆన్‌లైన్ వ్యాపారి ప్రవిన్ గణేశన్‌ను అరెస్టు చేశారు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో ఉన్నప్పుడు గణేశన్ అప్‌లోడ్ చేసిన ఈ పోస్ట్, ఒక ఆన్‌లైన్ ప్రకటనలో భాగంగా ఉంది. అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న గణేశన్, ఆ పోస్ట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో దానిని తొలగించారు. పోలీసుల సమాచారం ప్రకారం గణేశన్ ‘కామాకార్ట్ ఇండియా’ పురుషులు , మహిళల కోసం వ్యక్తిగత ఉత్పత్తుల విక్రయ సంస్థతో పాటు చైనాలో ‘వింట్రాక్ ఇంక్’ , ‘వింట్రాక్ స్పేసెస్’ ’24 చెట్టియార్ కేఫ్’ వంటి వ్యాపారాలను నడుపుతున్నారు. ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ సుజాత నేతృత్వంలోని సౌత్ చెన్నై సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసింది.
పోలీసులు గణేశన్ ఆచూకీని గుర్తించారు. చెన్నై పోలీస్ కమిషనర్ ఎ. అమల్‌రాజ్ ఆదేశాల మేరకు అతనిపై ‘లుక్ అవుట్ సర్క్యులర్’ జారీ చేశారు. తెల్లవారుజామున హాంకాంగ్ నుండి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న గణేశన్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఉన్న సైబర్ క్రైమ్ విభాగం ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ దుర్గ నేతృత్వంలోని బృందం, గణేశన్‌ను అక్కడి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందింది. అదుపులోకి తీసుకున్న తర్వాత జూన్‌లో పెట్టి ఆ తర్వాత తొలగించిన సోషల్ మీడియా పోస్ట్‌కు సంబంధించిన ఎల్ఓసీ కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని గణేశన్ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రముఖ సామాజిక వేదిక ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.


















