అల్లూరి సీతారామరాజు జిల్లా : అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలలో 29 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ విశిష్ట సేవలు అందిస్తోందని చెప్పారు ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు వెళుతోందని చెప్పారు. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు ట్రస్ట్ ప్రారంభించారని అన్నారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించాలనే ట్రస్టును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు అనుకున్న విధంగానే నేను కూడా ట్రస్టీగా ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నానని చెప్పారు నారా భువనేశ్వరి. వైద్య సేవలు, విద్యా, మహిళా సాధికారతకు ఆలోచనలు చేసి అందుకు తగ్గ సాయం అందిస్తున్నామని అన్నారు..
గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు రంపచోడవరంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం అత్యవసర సేవలు అందించాల్సి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు, ప్రభుత్వానికి రికమెండ్ చేస్తామని స్పష్టం చేశారు నారా భువనేశ్వరి. ఈ మహత్తర కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు మందుకొచ్చి సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 16,365 హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగిందన్నారు. 22.64 లక్షల మంది వైద్య సేవలు పొందారని వెల్లడించారు. రూ.22.97 కోట్ల విలువైన మందులను ప్రజలకు పంపిణీ చేశామన్నారు.



















