న్యూఢిల్లీ : ఈనెల 21న దేశ వ్యాప్తంగా నీట్ యుజి 2026 ఎగ్జామ్ తిరిగి నిర్వహించనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). ఈ పరీక్షకు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన చేసింది ఎన్టీఏ. రీ టెస్టు కోసం అడ్మిట్ కార్డ్ రిమైండర్ జారీ చేసింది. అభ్యర్థులకు ఎస్ఎంఎస్ (సంక్షిప్త సందేశం) , ఈమెయిల్ , వాట్సాప్ ద్వారా సమాచారం పంపుతోంది. ఇదిలా ఉండగా నకిలీ సందేశాలను పట్టించు కోవద్దని గట్టిగా సూచించింది ఎన్టీఏ. నీట్ యుజి రీ పరీక్ష కోసం అభ్యర్థులు కొత్త అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది, అలాగే నకిలీ సందేశాలు, డబ్బు చెల్లింపు అభ్యర్థనలు , పేపర్ లీక్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ యుజి పరీక్ష వాస్తవానికి ఈ ఏడాది మే 3న జరిగింది, అయితే పేపర్ లీక్ ఆరోపణల కారణంగా మే 12న రద్దు చేయబడింది. ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ అంశంపై దర్యాప్తు చేస్తోంది. అధికారిక ఎస్ఎంఎస్ సందేశాలు ఎన్ఐసీపీఈపీ అనే సెండర్ ఐడీ నుండి , ఈమెయిళ్లు “no-reply.neet.nta@nic.in” నుండి వస్తాయని ఎన్టీఏ తెలిపింది. ఈ ప్రక్రియకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ http://neet.nta.nic.in మాత్రమేనని, అభ్యర్థులు ఈ యుఆర్ఎల్ ను నేరుగా తమ బ్రౌజర్‌లలో నమోదు చేసుకోవాలని సూచించింది.
ఎన్టీఏ ఎప్పుడూ డబ్బు చెల్లింపును కోరదు, పరీక్షా పత్రాలు, ఆన్సర్ కీలు లేదా ‘లీక్’ అయిన మెటీరియల్‌ను పంపదు లేదా లింక్ ద్వారా మీ అడ్మిట్ కార్డును షేర్ చేయదు అని పేర్కొంది. అటువంటి సందేశం ఏదైనా వస్తే, దానిపై క్లిక్ చేయవద్దు. దానిని రిపోర్ట్ చేయండి అని కూడా తెలిపింది. అదనంగా, రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించిన పరీక్షా అప్‌డేట్‌లు, పరీక్షా కేంద్రం వివరాలను ఇకపై వాట్సాప్ ద్వారా నేరుగా అభ్యర్థులకు పంపుతామని ఎన్టీఏ పేర్కొంది. అభ్యర్థులు పంపినవారి పేరు పక్కన నీలి రంగు వెరిఫైడ్ టిక్, ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ అనే పేరు ఉన్నాయో లేదో నిర్ధారించు కోవాలని స్పష్టం చేసింది.















