హైదరాబాద్ : కనుమరగై పోయిన చెరువుల జాడ తెలుసు కోవడంతో పాటు, ఉన్న వాటి ఎఫ్‌టీఎల్ లెక్కలు తేల్చడానికి ఎన్ ఆర్ ఎస్ సీ (NRSC )అందిస్తున్న ఉపగ్రహ ఆధారిత డేటా హైడ్రాకు“వజ్రాయుధం” లా మారిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. చెరువులు, నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధిలకు సంబంధించిన సమాచారం ఒక్కో విధంగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో ఎన్ ఆర్ ఎస్ సీ డేటా దిక్సూచిలా మారిందన్నారు. వికసిత్ భారత్ @ 2047 సాధనలో భూమి పరిశీలన విధానాలు – ధోరణులు, సవాళ్లు అనే అంశంపై ఎన్ ఆర్ ఎస్ సీ సెంటర్లో జరిగిన సదస్సులో హైడ్రా కమిషనర్ అతిథిగా హాజరై ప్రసంగించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణలోనే కాదు.. ప్రబుత్వ భూములు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాల లెక్క తేల్చడంలో కూడా ఎన్ ఆర్ ఎస్ సీ డేటా హైడ్రాకు ఎంతో ఉపయోగ పడుతోందని చెప్పారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వందలాది మంది వస్తుంటారని తెలిపారు ఏవీ రంగనాథ్. వారి ఫిర్యాదులను అక్కడికక్కడే పరిశీలించడానికి కూడా ఈ డేటా వాడుతున్నామన్నారు. ఎప్పుడు ఎలా భూ వినియోగం మారిందో ఫిర్యాదుదాలరకు కళ్లకు కట్టినట్టు చూపించి చాలా వరకు సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఓఆర్ ఆర్ వరకూ హైడ్రా పరిధి విస్తరించి ఉందని.. ఎన్ ఆర్ ఎస్ సీ లెక్కల ప్రకారం దాదాపు 61 శాతం చెరువులు మాయం అయ్యాయని తెలిపారు. మరో 15 సంవత్సరాలలో మిగతా చెరువులు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. ఇలాంటి తరుణంలో చెరువుల జాడ తెలుసుకుని వాటిని పరిరక్షించే పనిని ముమ్మరం చేశామని చెప్పారు.
