మాతృ భాష రాక పోవడం అత్యంత అవమానకరం

త‌మిళానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరిన ధ‌నుష్

hellotelugu-ActorDhanush

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు పొందిన ధ‌నుష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భాష పై కీల‌క ప్ర‌స్తావ‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. తమిళానికి ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు ధనుష్ పిలుపు ఇచ్చారు. కాలక్రమేణా భాషా నైపుణ్యంలో వచ్చిన మార్పులను ధనుష్ ప్రస్తావించారు. యువతలో తమిళం వాడకం తగ్గి పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమిళంలో అనర్గళంగా మాట్లాడ గలగడం అన్నింటికంటే ముఖ్యమని చెప్పారు. గురువారం ధ‌నుష్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు తమ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని నటుడు కోరారు. చెన్నైలో జరిగిన ఒక పాఠశాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు త‌మిళ భాష గురించి. రోజు రోజుకు త‌మ భాష‌లో మాట్లాడాలంటే నామోషీగా ఫీల‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ధనుష్.

భాషా నైపుణ్యంలో కాలక్రమేణా వచ్చిన మార్పులను విశ్లేషించారు. యువతలో తమిళం వాడకం తగ్గి పోవడం పట్ల తీవ్ర ఆవేద‌న చెందారు. దీనిని తాను త‌ట్టుకోలేక పోతున్నాన‌ని అన్నారు. నేను పాఠశాలలో ఉన్నప్పుడు, మాకు తమిళం బాగా వచ్చేది, కానీ ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా ఉందన్నారు. తాను క‌లిసిన పది మందిలో ఎనిమిది మందికి తమిళం రావడం లేదంటూ వాపోయాడు ధ‌నుష్. మాతృ భాషను కాపాడు కోవడం ప్రాముఖ్యతను ఆయ‌న నొక్కి చెప్పారు. అన్నింటికంటే ముందుగా ఒక వ్యక్తి తన మాతృ భాషలో అనర్గళంగా మాట్లాడగలగాలి అని ఆయన అన్నారు. తమిళం అనర్గళంగా మాట్లాడ లేక పోవడాన్ని ఒక విజయంగా లేదా గొప్ప విషయంగా భావించ కూడదని కూడా ఆయన పేర్కొన్నారు.

నాకు తమిళం సరిగ్గా రాదు అని చెప్పుకోవడం గర్వకారణం కాదు, అది ఒక అవమానం అని ఆయన అన్నారు, అలాగే ఆ భాషను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.

Exit mobile version