ముంబై : ఇంగ్లాండ్ , ఐర్లాండ్ పర్యటనల్లో భారత క్రికెట్ జట్టు విజయాలు సాధించలేక పోయినప్పటికీ, జట్టు మెరుగు పరుచు కోవాల్సిన అంశాలను గుర్తించిందని ఇండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. హరారేలో జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు ముందు, ఇంగ్లాండ్‌లో జట్టు నిరాశజనక ప్రదర్శన తర్వాత విమర్శల భారం లేకుండా నిర్భయంగా ఆడాలని తన ఆటగాళ్లకు సూచించారు . ఇటీవలి ఎదురు దెబ్బలు జట్టును మరింత ఏకం చేశాయని ఆయన అన్నారు. ఇంగ్లాండ్‌లో మాకు కొంత కఠినమైన సమయం ఎదురైంది, కానీ దాని నుండి చాలా సానుకూల అంశాలు కూడా లభించాయి. భవిష్యత్తులో ఒక జట్టుగా మేము ఎలా ఎదగాలి, మైదానంలో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి మానసిక దృఢత్వం, అవగాహన , పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యం అవసరమో మాకు తెలిసింది అని చెప్పాడు కెప్టెన్.
ఇక్కడ జరగనున్న తొలి T20 మ్యాచ్‌కు ముందు అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ , ఐర్లాండ్ సిరీస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా మొదటి సారి. ఇక జింబాబ్వే పర్యటనకు వచ్చిన కెప్టెన్, తక్కువ సమయంలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారడమే అతిపెద్ద సవాలు అని అన్నారు.మాలో కొందరు ఇక్కడ మొదటిసారి ఆడుతున్నారు, కాబట్టి మేము ఎంత త్వరగా పరిస్థితులకు అలవాటు పడితే అంత మంచిదన్నాడు శ్రేయాస్ అయ్యర్. ఇటీవలి ప్రదర్శనల తర్వాత ఎదురైన విమర్శలు లేదా పరిశీలనల గురించి ఆందోళన చెందకుండా, వైఫల్య భయం లేకుండా ఆడాలని అయ్యర్ జట్టులోని యువ ఆటగాళ్లకు సూచించారు. వారు వైఫల్యానికి భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం, ఎందుకంటే మనసులో అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు, ఆటగాళ్లు తమ స్థానాన్ని కాపాడు కోవడం కోసమే ఆడతారు. ఆ భయం లేనప్పుడు, మీరు మీ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచే ఛాన్స్ ఉంటుందన్నాడు.
బయట ప్రజలు ఏమనుకుంటున్నారో లేదా ఏం మాట్లాడుకుంటున్నారో దాని గురించి మేము ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నాడు. మనం ప్రస్తుత సమయంపైనే దృష్టి పెట్టాలి. ఎంత బాగా క్రికెట్ ఆడి, ఒక జట్టుగా కలిసికట్టుగా ఆడతామో, జట్టుకు అంత మంచిదని అన్నాడు అయ్యర్. ఇది ఖచ్చితంగా చాలా సవాలుతో కూడుకున్న విషయం. మేము నిన్ననే వచ్చాము, ఈ రోజు ప్రాక్టీస్, రేపు మ్యాచ్. కానీ ఇది ఆనందదాయకం, ఇలాంటి పరిస్థితుల్లో బాగా రాణిస్తే, మీపై మీకే గర్వంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు కెప్టెన్. ఇది గొప్ప అనుభవం, ఎందుకంటే ఇలాంటి అవకాశాలు తరచుగా రావు. ఇది ఒక సవాలుతో కూడిన దశ, దీనిని ఎంత త్వరగా అధిగమిస్తే జట్టుగా అంత మెరుగ్గా తయారవుతామని పేర్కొన్నాడు.
