న్యూఢిల్లీ : ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న కేబినెట్ లో కొందరిని మార్చవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించారు ఖర్గే. ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియలోని వివిధ అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇప్పటి వరకు పార్టీ నాయకత్వం ముందు ఎటువంటి అధికారిక ప్రతిపాదన ఉంచబడలేదని ఖర్గే తెలిపారు. ఆదివారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. జూన్ 3న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత జరిగే సంప్రదింపుల అనంతరం మాత్రమే మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు , కీలక నియామకాలపై నిర్ణయాలు తీసుకుంటామని ఆయన సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియలోని వివిధ అంశాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
అయితే ఇప్పటి వరకు పార్టీ నాయకత్వం ముందు ఎటువంటి అధికారిక ప్రతిపాదన ఉంచబడలేదని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపాదన అందిన తర్వాత, ఎంతమంది మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను నియమించాలి, వాటితో పాటే ముఖ్యమైన చైర్మన్ పదవులను కూడా భర్తీ చేయాలా వద్దా అనే అంశాలపై చర్చలు జరుగుతాయని చెప్పారు ఏఐసీసీ చీఫ్. ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాతే పార్టీకి పూర్తి స్పష్టత వస్తుందని ఖర్గే తెలిపారు. ఈ విషయాలన్నీ ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. జూన్ 3 తర్వాత మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతానికి మనం వేచి చూడాల్సిందే అని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం మంత్రులే కాకుండా ఇతర నేతలను కూడా పరిశీలిస్తుండటంతో KPCC రేసు మరింత విస్తృతమైంది.
