విజయవాడ : ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ 20 ఇథనాల్ పై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే వారు ఉద్దేశ పూర్వకంగా ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిందన్నారు. మద్యం కేసుల్లో ఆ పార్టీ నేతలు జైలు పాలుకావడం, సొంత పార్టీ ఎంపీలు, కార్యకర్తల్లోనే నమ్మకం సన్నగిల్లడం చూస్తున్నాం అన్నారు. ఈ తరుణంలో పార్టీ ఉనికి చాటుకునేందుకే తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు రేణుక. పంజాబ్ లో ‘సూపర్ సీఎం’గా పెత్తనం చెలాయిస్తున్న కేజ్రీవాల్ కు.. అక్కడ డ్రగ్స్ మాఫియా, పేపర్ లీకేజీలు, నిరుద్యోగంతో పాటు ప్రధానంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు.
2027 ఫిబ్రవరిలో పంజాబ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తి (దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే 2000 కోట్ల లీటర్లలో 68 కోట్ల లీటర్లు పంజాబ్ నుంచే వస్తోంది) ద్వారా లాభపడుతున్న రైతులు తమకు దూరమవుతారనే భయంతోనే కేజ్రీవాల్ ఈ ‘సెలెక్టివ్ ఫోర్సబుల్ కాంట్రవర్సీ’కి తెరతీశారని మండిపడ్డారు . కేజ్రీవాల్ సహా కొందరు పనిగట్టుకుని ఈ-20పై చేస్తున్న దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఈ-20 ఇంధనంతో మైలేజ్ భారీగా పడిపోతుందనేది పచ్చి అబద్ధం అన్నారు రేణుక. వాహనం మోడల్, డ్రైవింగ్ చేసే విధానాన్ని బట్టి కేవలం 1 నుంచి 5 శాతం మాత్రమే (మార్జినల్) వ్యత్యాసం ఉండొచ్చు అని పేర్కొన్నారు.
సాధారణ పెట్రోల్ వాడినా ట్రాఫిక్ లో బ్రేకులు, యాక్సిలరేషన్ కారణంగా ఇంతే మైలేజ్ తగ్గుతుందన్నారు. ఈ-20 వల్ల కలిగే లాభాలతో పోలిస్తే ఇది అత్యంత స్వల్పం అని పేర్కొన్నారు. ఈ ఇంధనం వాడే వాహనాలకు బీమా, వారెంటీ వర్తించవని తప్పుదోవ పడుతున్నారు. సాధారణ వాహనాలకు వర్తించినట్లే వీటన్నింటికీ బీమా, వారెంటీ వర్తిస్తుందని తయారీ, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికే స్పష్టం చేశాయన్నారు రేణుక. 2024 నుంచి పలు నగరాల్లో ఈ ఇంధనం అందుబాటులో ఉందన్నారు. మన దేశంలో 85-88 శాతం ద్విచక్రవాహనాలే. రెండేళ్లుగా వాడుతున్నా కేవలం 4-5 శాతం మాత్రమే సాధారణ ఫిర్యాదులు వచ్చాయన్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్ వృద్ధి కూడా 9 నుంచి 11 శాతం పెరిగిందన్నారు.

















