బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయు) 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ కోసం తన స్నాతకోత్సవాన్ని రద్దు చేసింది. గురువారం ఇందుకు సంబంధించి అధికారికంగా కీలక ప్రకటన చేసింది . ఇదిలా ఉండగా ఆగస్టు 3న వార్షిక స్నాతకోత్సవం సెప్టెంబర్ 12న జరుగుతుందని యాజమాన్యం గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇమెయిల్ పంపింది. అయితే ‘అనివార్య పరిస్థితుల’ కారణంగా స్నాతకోత్సవం జరగదని, విద్యార్థులకు వారి డిగ్రీలు గైర్హాజరులో (ఇన్-అబ్సెన్షియా) ప్రదానం చేయబడతాయని ఇప్పుడు ప్రకటించింది.
మనమందరం కలిసి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, అనివార్య పరిస్థితుల కారణంగా తాము 34వ వార్షిక స్నాతకోత్సవాన్ని నిర్వహించలేక పోతున్నామని పేర్కొంది. పాలక మండళ్ల నుండి తగిన ఆమోదాలు పొందిన తర్వాత, గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ వారి డిగ్రీలు గైర్హాజరులో (ఇన్-అబ్సెన్షియా) ప్రదానం చేయబడతాయని అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది యూనివర్శిటీ. విద్యార్థులు తమ సర్టిఫికెట్లను కొరియర్ ద్వారా స్వీకరించడానికి లేదా క్యాంపస్‌లో వాటిని తీసుకోవడానికి ఎంచుకోవచ్చని అందులో తెలిపారు. తమకు నచ్చిన ఎంపికను ఎంచుకోవడానికి వీలుగా,విశ్వ విద్యాలయం ఒక కొత్త ఫారం, ప్రక్రియను గ్రాడ్యుయేట్ విద్యార్థులందరితో పంచుకుంటుంది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ స్నాతకోత్సవానికి హాజరు కావడాన్ని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు వ్యతిరేకించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడింది. స్నాతకోత్సవానికి మిశ్రా , సీజేఐ హాజరు కావడాన్ని 700 మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్యనివర్శిటీ ఆఫ్ లా యొక్క విద్యార్థి, అధ్యాపక వర్గానికి బీసీఐ చైర్మన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేశారు.
