హర్యానా : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా రాష్ట్రంలోని అంబాలా పోలీస్ స్టేషన్ ఐఈడీ పేలుడు కేసులో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది షెహజాద్ భట్టితో సహా ఎనిమిది మందిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. బల్దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద 2026 జనవరిలో జరిగిన ఐఈడీ కారు బాంబు పేలుడుకు సంబంధించి, పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌గా ఉండి ఉగ్రవాదిగా మారిన షెహజాద్ భట్టితో సహా ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లు గుర్తించింది.
ఛార్జిషీట్‌లో పేర్కొన్న వారిలో కరమ్‌జిత్ సింగ్ అలియాస్ టోనీ, ఆకాష్, సౌరేబ్ అలియాస్ సోబి అలియాస్ సౌరబ్, రమణ్ కుమార్, సత్యం, సుఖ్‌దేవ్ సింగ్ అలియాస్ సుఖా, అమర్‌జీత్ సింగ్ అలియాస్ అంబి ఉన్నారని తెలిపింది. పంచ్‌కులలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో, నిందితులు పోలీసు సంస్థలను లక్ష్యంగా చేసుకుని, భయోత్పాతం సృష్టించడానికి కుట్ర పన్నారని ఆరోపించబడింది.
ఎన్ఐఏ ప్రకారం, షెహజాద్ భట్టి సోషల్ మీడియా , ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కార్యకర్తలను నియమించుకుని, వారిలో తీవ్రవాద భావజాలాన్ని నింపగా, అతని ఆదేశాల మేరకు స్థానిక మాడ్యూళ్లు లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి, పేలుడు పదార్థాలను సేకరించి, దాడిని అమలు చేశాయని వెల్లడించింది . ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ తెలిపింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఆపరేషన్ లో భాగంగానే ఇది చోటు చేసుకుందని ఎన్ఐఏ ప్రకటించింది.
