కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక

కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన తెలంగాణ స‌ర్కార్

hellotelugu-NDSAreport

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసిన కేసీఆర్ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి కీల‌క వివ‌రాలు వెల్ల‌డించింది తెలంగాణ స‌ర్కార్. ఎన్డీఎస్ఏ తుది నివేదికను పరిగణనలోకి తీసుకుని, దానికి అనుగుణంగా సాంకేతిక పర్యవేక్షణ కమిటీ సూచనలను కచ్చితంగా పాటిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్ప‌ష్టం చేసింది . ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలలో నీటిని నిల్వ చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుత సమస్యలతో పాటు పరిష్కారాలకు అవసరమైన అన్ని సూచనలను కూడా ఆ సంస్థ అందించింది అని తెలిపింది. ఆ నివేదికను పరిగణనలోకి తీసుకుని, ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం నిపుణుల కమిటీ సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంద‌ని వెల్ల‌డించింది.

నీరు ప్రవహిస్తున్నప్పటికీ గోదావరి నుండి నీటిని ఎత్తిపోసే (లిఫ్ట్ చేసే) పరిస్థితి లేదని, అయినప్పటికీ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా మరియు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించిన వారు, ఎన్డీఎస్ఏ సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాట్లాడి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.

గోదావరి నదిలో నీరు ప్రవహిస్తున్నంత మాత్రాన దానిని ఎత్తిపోయడం సాధ్యం కాదు. అందుకు బ్యారేజీలు ఏమాత్రం అనుకూలంగా లేవు. నీటిని ఎత్తిపోయాలంటే ముందుగా దానిని నిల్వ చేయాలన్నారు. నిల్వ లేకుండా నీటిని ఎత్తిపోసే అవకాశం లేదు. ప్రవహిస్తున్న గోదావరి నుండి నీటిని ఎత్తిపోసేందుకు బ్యారేజీలను ఎందుకు ఉపయోగించాలి అని ప్రశ్నించారు. దేశంలోని ప్రాజెక్టులు, డ్యామ్‌లను పర్యవేక్షించడానికి, కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 30న పార్లమెంటు ద్వారా డ్యామ్ భద్రతా చట్టాన్ని ఆమోదించింది అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉన్న డ్యామ్‌ల తనిఖీలు, పర్యవేక్షణ, నిర్వహణ మరియు మరమ్మతుల కోసం ఈ అథారిటీ తగిన యంత్రాంగంతో ఈ చట్టాన్ని రూపొందించిందన్నారు.

Exit mobile version