విశాఖ డేటా సెంట‌ర్ పై వివ‌ర‌ణ కోరిన ఎన్జీటీ

అనుమ‌తి ఇవ్వాల‌నే దానిపై కొన‌సాగుతున్న విచార‌ణ

hellotelugu-NGT

న్యూఢిల్లీ : జాతీయ గ్రీన్ ట్రైబ్యూన‌ల్ (ఎన్జీటీ) ప్ర‌స్తుతం ఏపీలోని విశాఖ‌లో ఏర్పాటు చేసిన డేటా సెంట‌ర్ పై విచార‌ణ చేప‌ట్టింది. ఇందుకు సంబంధించి అనుమతులపై కేంద్ర స‌ర్కార్ ను వివ‌ర‌ణ కోరింది. విశాఖపట్నంలో ప్రతిపాదించిన రూ. 17,700 కోట్ల విలువైన ‘అదానీ ఇన్ఫ్రా విశాఖ హైపర్‌స్కేల్ డేటా సెంటర్’ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అడివివరం, ముదసర్లోవ గ్రామ పరిధిలోని 601.4 ఎకరాల్లో 512 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు, 2026 జూన్ 10న పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. దీనిని వ్యతిరేకిస్తూ మాజీ సీపీఎం కార్పొరేటర్ బొడ్డు గంగారావు ఎన్జీటీలో అప్పీలు దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టు కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యానికి సుమారు 750 మీటర్ల దూరంలో, దాని పరిధిలోని పర్యావరణ సున్నిత ప్రాంతానికి సుమారు 470 మీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును తప్పుగా ‘కేటగిరీ బి2’ కింద వర్గీకరించడం ద్వారా, కఠినమైన పర్యావరణ అంచనా ప్రక్రియను తప్పించుకునేలా చేశారని ఆయన ఆరోపించారు.

ప్రాజెక్టు పరిమాణం , పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలకు దగ్గరగా ఉండటం దృష్ట్యా, దీనికి రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ అనుమతులు ఇవ్వడం కాకుండా, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సమగ్ర పరిశీలన జరగాలని ఆయన వాదించారు. అంతేకాకుండా, విశాఖపట్నానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న ముదసర్లోవ రిజర్వాయర్‌పై ఈ ప్రాజెక్టు ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల రిజర్వాయర్‌కు నీటిని అందించే ప్రవాహ మార్గాలకు అంతరాయం కలిగి, నీటి లభ్యతపై దీర్ఘకాలిక ప్రభావం పడవచ్చని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని, అలాగే ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు నిర్మాణ పనులను వెంటనే నిలిపి వేయాలని గంగారావు కోరారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 26కి వాయిదా వేసిన ఎన్జీటీ, అప్పటిలోపు కేంద్ర ప్రభుత్వం తన వివరణను సమర్పించాలని ఆదేశించింది.

Exit mobile version