న్యూఢిల్లీ : ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా బోరా ఢిల్లీలోని హైకోర్టును ఆశ్రయించారు. రూ. 10,000 బాండ్ సమర్పించాలన్న పోలీసు నోటీసుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్టోబర్ 16న కన్నాట్ ప్లేస్‌లో తలపెట్టిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే మార్చ్‌కు ముందు ఢిల్లీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరుగుతున్న సమయంలో శాంతిని కాపాడేందుకు హామీగా రూ. 10,000 వ్యక్తిగత బాండ్‌తో పాటు పూచీకత్తు సమర్పించాలని కోరుతూ పోలీసులు జారీ చేసిన నోటీసును ఆమె సవాలు చేశారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసినట్లు బోరా తరఫు న్యాయవాదుల బృందం తెలిపింది. కోర్టు సెలవుల సమయంలో పనిచేసే బెంచ్ ముందు ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు. కన్నాట్ ప్లేస్ (రాజీవ్ చౌక్) వద్ద జరగాల్సిన “లెహ్రా దో తిరంగా” మార్చ్‌కు ముందు 16న ఢిల్లీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం సాయంత్రం మార్చ్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 65 కింద లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత శనివారం తెల్లవారు జామున ఆమెను విడుదల చేశారని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ మార్చ్ జరిగింది. నిరసనకారులు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నుండి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశారు. నిరసన ప్రారంభం కాకముందే పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన, నిరసనల నిర్వాహకులు మరియు పాల్గొనేవారిపై తీసుకునే ‘ముందస్తు చర్యల’ పై విస్తృత చర్చకు దారితీసింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను కూడా ఈ మార్చ్‌కు ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరై, శాంతిని కాపాడేందుకు బాండ్ సమర్పించిన తర్వాత విడుదలయ్యారు.

















