న్యూఢిల్లీ : కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రం కేంద్రంగా మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ యుజి 2026 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. దీనిపై కేంద్రం సీబీఐని విచారణకు ఆదేశించింది. దీంతో గత్యంతరం లేక ఎన్టీఏ పరీక్ష పేపరును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే జూన్ నెల 21వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కీలక ప్రకటన చేశారు విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్. వచ్చే ఏడాది 2027 నుండి నీట్ -యుజి పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తామని అన్నారు.
పరీక్షా విధానంలో కీలక మార్పులు తీసుకు వస్తామని నొక్కి చెప్పారు. నీట్ యుజి 2026 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 14 నాటికి జారీ చేయబడతాయని కేంద్ర మంత్రి ప్రధాన్ తెలిపారు. అలాగే, ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దయిన గత పరీక్ష స్థానంలో, పునఃపరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. జాతీయ వైద్య ప్రవేశ పరీక్షా విధానంలో ఒక కీలక సంస్కరణగా వచ్చే ఏడాది నుండి పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించ బడుతుందని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించామని, కానీ అనుకోని పరిస్థితుల్లో పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా ఈసారి నిర్వహించబోయే పరీక్షను మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తామన్నారు.
