హైదరాబాద్ : ఓ వైపు ఎలినినో ప్రభావం దెబ్బకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి, రైతులు పంటకు అవసరమైన అన్ని పోషకాలను సమతుల్యంగా వినియోగించేలా ధరల విధానాన్ని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అభిప్రాయపడ్డారు. ఎరువుల ధరల రేషనలైజేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఎటువంటి స్పందన కనిపించడం లేదని పేర్కొన్నారు. మోతాదుకు మించి యూరియా వినియోగాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఒకవైపు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని , మరోవైపు ఎరువుల ధరలపై రేషనలైజేషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం సరికాదని మంత్రి తుమ్మల అన్నారు. యూరియా తక్కువ ధరకు లభిస్తుండటం, ఇతర ఎరువులు అధిక ధరకు లభిస్తుండటంతో రైతులు సహజంగానే తక్కువ ధరలో లభించే యూరియా వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. దీని వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల నాణ్యతపైనా ప్రభావం పడే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల ధరల విధానంలో సమతుల్యత తీసుకు రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రైతులు సమతుల్య ఎరువుల వినియోగం వైపు వెళ్లేలా ధరల విధానాన్ని మార్చకుండా, కేవలం యూరియా వినియోగాన్ని తగ్గించాలని రైతులకు సూచించడం వల్ల ఆశించిన ఫలితాలు రావని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి, ఎరువుల ధరలను రేషనలైజ్ చేసి నేల ఆరోగ్యాన్ని, పంటల నాణ్యతను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు పంటలకు శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వినియోగించేలా చూడాలని మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్ట్, బయోఫెర్టిలైజర్స్ వంటి ప్రత్యామ్నాయ పోషక వనరులను కూడా వినియోగించు కోవాలని అన్నారు. యూరియా, డీఏపీకి ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీని సిఫారసు చేసిన మోతాదులో భాగంగా వినియోగించు కోవచ్చని సూచించారు.

















