అమరావతి : రైతులు ప్రకృతి సేద్యంపై ఫోకస్ పెట్టాలని తద్వారా మెరుగైన ఆదాయాన్ని పొందుతారని అన్నారు మంత్రి ఎస్. సవిత. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక రోగాలతో మనుషుల ప్రాణాల పోవడంలో ప్లాస్టిక్ తో పాటు అతిగా ఎరువుల వాడకం కూడా కారణమని మంత్రి తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తోందన్నారు. సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్ మంచి డిమాండ్ ఉందని, తద్వారా అధిక లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. జంక్ ఫుడ్ కారణంగా క్యాన్సర్ వ్యాపిస్తోందని, తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలని మంత్రి సవిత సూచించారు. చెత్తను ఎక్కడి పడితే అక్కడ పడేయకుండా, ఇంటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలన్నారు.
స్వచ్ఛ పెనుకొండ బాధ్యత పట్టణ ప్రజలందరిదీనని స్పష్టం చేశారు. అనంతరం గాంధీ సర్కిల్ లో మానవ హారంగా ఏర్పడి, ప్రతిజ్ఞ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటామని మానవ హారంలో పాల్గొన్నవారితో మంత్రి సవిత ప్రతిజ్ఞ చేయించారు. నా దేశం – నా బాధ్యత కింద ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రం పాటించాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు మాటలను మంత్రి తూచ తప్పకుండా పాటించారు. పెనుకొండ పట్టణంలోని గాంధీ సర్కిల్ లో నిర్వహించిన స్వచ్చంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి సవిత తన క్యాంపు కార్యాలయం నుంచి నడుచుకుంటూ వెళ్లి పాల్గొన్నారు. ఎటువంటి వాహన శ్రేణిని వినియోగించకుండా, మంత్రి సవిత ఈ కార్యక్రమంలో పాల్గోనడంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమయ్యాయి. అంతకు ముందు పట్టణంలోని షాపులు, తోపుడు బండ్ల వద్దకు గుడ్డతో తయారు చేసిన క్యారీ బ్యాగ్ లను అందజేశారు.
