అమరావతి : తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ బుదవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదని, అది అత్యున్నత బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్ని ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డాడని ప్రశంసించారు. లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ట్రైనింగ్ క్లాసులు మొదలుకుని కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు బాబు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేషేనని అన్నారు.
నారా లోకేష్ సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాం అని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో టీడీపీ బలం పెరగాలన్నారు. 2024లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు రావాలన్నారు.
2024కు ముందున్న పరిస్థితులన్నీ అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. నాకు ప్రతి ఘటన… ప్రతి ఒక్కరి పోరాటం గుర్తుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. కార్యకర్తలు పడ్డ కష్టాలు నాకు గుర్తున్నాయన్నారు. వెంటిలేటర్ మీదున్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సాయంతో గట్టెక్కిస్తున్నాం అని చెప్పారు.
















