Siddareddy : హైదరాబాద్ – ప్రముఖ కవి, రచయిత నందిని సిద్దారెడ్డి (Siddareddy) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పలుకులతో నాలుగున్నర ప్రజలలో గూడు కట్టుకున్న తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తొలగించ లేరంటూ కుండ బద్దలు కొట్టారు. బలిదానాలు, ఆత్మహత్యలు, పోరాటాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఎవరూ మార్చ లేరంటూ పేర్కొన్నారు. ఎవరికీ అంత సత్తా లేదన్నారు. తెలంగాణను తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు నందిని సిద్దారెడ్డి.
Siddareddy Shocking Comments
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉండే పత్రికలు, నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాధాకృష్ణ కొత్త పలుకుల పేరిట రాసిన వ్యాసంలో హెడ్డింగ్ బీఆర్ఎస్ ను రాజకీయంగా విమర్శించినట్లుగా పెట్టి, లోపల తెలంగాణ అస్థిత్వాన్ని అస్థిర పరిచే రాతలు రాశాడని ఆరోపించారు నందిని సిద్దారెడ్డి (Siddareddy). ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని , ఏదో ఒక రోజు చర్యకు ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజలను తక్కువ అంచనా వేస్తే ఇబ్బంది పడేది మీరేనని చురకలు అంటించారు.
మీడియా పేరుతో స్లాటర్ హౌస్ లు నడిపిస్తున్న మీకు తెలంగాణ గురించి రాసే, మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు నందిని సిద్దారెడ్డి. ఇప్పుడిప్పుడే తెలంగాణ, ఆంధ్ర అనే భావన లేకుండా అందరు సంతోషంగా ఉన్నారంటూ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్ర భావన లేకుండా సంతోషంగా ఉన్నది కేవలం రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి, ఆయన గురువు చంద్రబాబు మాత్రమేనని అన్నారు.
ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చింది ఎందుకు మాట్లాడాలి అని మౌనంగా ఉంటే మన చిహ్నంలో కాకతీయ తోరణం మాయమైంది.. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది. భారతదేశ చిత్రపటంలో తెలంగాణనే తీసేశారంటూ వాపోయారు నందిని సిద్దారెడ్డి. జయసుధ కూడా గద్దర్ అవార్డులు ఇచ్చే టప్పుడు కళకు ప్రాంతం ఉండదని అంటోందని, మరి ఏం ఉంటుందో చెప్పాలన్నారు. కళకే కాదు రాజకీయానికి ప్రాంతం ఉంటుందన్నారు. ఇవన్నీ ఏదో అనుకోకుండా జరిగిన ఘటనలు కావు, చాలా పక్కా ఆలోచనలతో కుట్ర పూరితంగా చేసినవేనని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతీయత అస్థిత్వం మీదనే రాష్ట్రం ఏర్పడిందని గుర్తు పెట్టుకోవాలన్నారు.
Also Read : Minister Amit Shah Interesting : దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు


















