అమరావతి : ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైద్య విద్య అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. NRI ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 6వ గ్రాడ్యుయేషన్ దినోత్సవం సందర్భంగా డిగ్రీలు పొందిన గ్రాడ్యుయేట్లందరికీ అభినందనలు తెలిపారు. ఎన్నారై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2012-13 విద్యా సంవత్సరం నుండి పని చేస్తుంది.అనిల్ నీరుకొండ హాస్పిటల్ 2011లో బోధనా ఆసుపత్రిగా స్థాపించారు. ప్రారంభంలో 300 బెడ్ల సామర్థ్యంతో అనిల్ నీరుకొండ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం 1058 బెడ్లతో, 20 స్పెషాలిటీలు, 8 సూపర్ స్పెషాలిటీలతో పాటు 24 గంటల బ్లడ్ బ్యాంక్, ఎమర్జెన్సీ మెడిసిన్, డయాగ్నోస్టిక్ ల్యాబ్, MRI, CT, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫార్మసీ , ICU సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేశారు .
ఈ సందర్బంగా గవర్నర్ నజీర్ ప్రసంగించారు. వైద్య విద్య అనేది కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహిస్తుందన్నారు. వైద్య విద్య అనేది గ్రాడ్యుయేషన్‌తో ముగిసిపోదన్నారు. అది ఒక నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు గవర్నర్. వైద్య నిపుణులు మారుతున్న వైద్య పరిజ్ఞానాన్ని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని సూచించారు. దేశంలో వైద్య పురోగతితో పాటు ఆరోగ్య అసమానతలు ఉన్నాయన్నారు. దేశంలో సంతానోత్పత్తి రేటు ఇటీవల 2.01 కి తగ్గినప్పటికీ, ఇది చైనా (1.21), అమెరికా (1.67) కంటే ఎక్కువే ఉందన్నారు అబ్దుల్ నజీర్. దీనివల్ల జనాభా పెరుగుదల , ఆరోగ్య సేవలకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.















