బెంగళూరు : విశాఖపట్నంకు చెందిన ముస్కాన్ నయ్యర్ మిస్ ఎర్త్ ఇండియా 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గత మూడు నెలలుగా ఈ పోటీ లో గెలుపొందేందుకు పలువురు పోటీ పడ్డారు. కానీ చివరకు వైజాగ్ కు చెందిన నయ్యర్ ను వరించింది. బెంగళూరులోని ఫెదర్‌లైట్ ఎవోమాలో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా 2025 పోటీలలో సత్తా చాటారు. అట్టహాసంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో మిస్ ఎర్త్ ఇండియా 2025 కిరీటాన్ని ధరించారు. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఈ పోటీలో ఆడిషన్లు, లుక్ టెస్ట్‌లు , ఫోటో షూట్‌లతో సహా పలు దశలు ఉన్నాయి. భారతదేశం నలుమూలల నుండి వచ్చిన పోటీదారులతో పాటు, బ్రెజిల్, ఈక్వెడార్, స్పెయిన్ , వెనిజులా వంటి దేశాల నుండి కూడా పాల్గొన్నారు.
చివరకు ఎనిమిది మంది ఫైనలిస్టులు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు, అక్కడ ముస్కాన్ విజేతగా నిలిచింది. ఇక విశాఖకు చెందిన ముస్కాన్ ఫ్యాషన్ రంగంలో ప్రయాణం ఆమె పాఠశాల రోజుల్లోనే ప్రారంభమైంది, అప్పుడు ఆమె మిస్ టింపనీ 2016–17 కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె కోల్‌కతాలోని జె.డి. బిర్లా కళాశాలలో మార్కెటింగ్‌లో బీబీఏ చదివింది, అక్కడ ఆమె ఆ సంస్థ ఫ్యాషన్ బృందానికి నాయకత్వం వహించి, ఈ రంగంలో తన నైపుణ్యాలను, ఆసక్తిని మరింత మెరుగు పరుచుకుంది గత కొన్నేళ్లుగా తను మిస్ ఫ్యాషన్ ఐకాన్ గా ఉంటూ వచ్చింది. మిస్ వైజాగ్ ఫస్ట్ రన్నరప్, మిస్ అండ్ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి అనేక టైటిళ్లను గెలుచుకుంది.
