కోనసీమ రైల్వే పనులు వేగవంతం చేయండి

కేంద్ర‌ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరిన ఎంపీ హరీష్

hellotelugu-MPHaarishBalayogi

ఢిల్లీ : ఎంపీ హ‌రీష్ బాల‌యోగి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు పార్ల‌మెంట్ సాక్షిగా. గురువారం ఆయ‌న ఏపీకి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల ఆకాంక్షకు అనుగుణంగా కోటిపల్లి, నర్సాపూర్ రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి కోరారు. ఈ మేరకు ఢిల్లీ లోని మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి కోనసీమ రైల్వే లైన్, ద్వారపూడి రైల్వే స్టేషన్ ప్రయాణికుల సౌకర్యాలను మెరుగు పరచాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.

కోటిపల్లి, నర్సాపూర్ రైల్వే లైన్ కోనసీమ ప్రజల చిరకాల కల అని పేర్కొన్నారు ఎంపీ హ‌రీష్ బాల‌యోగి. ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రిని క‌లిసిన అనంత‌రం ఎంపీ మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాబోయే రోజుల్లో రైల్వే లైన్ పనులు మరింత వేగవంతం అవుతాయని తెలిపారు. అలాగే ద్వారపూడి రైల్వే స్టేషన్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, కోనసీమ రైల్వే లైన్ పై ప్రత్యేక దృష్టి సారించేందుకు మంత్రి వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ.

Exit mobile version