తిరుపతి : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజమని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మొదలైందని అన్నారు. దీనికి నిదర్శనంగా కోటి మందికి పైగా ప్రజలు తమ స్వహస్తాలతో సంతకాలు చేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలిచారని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక సంస్కరణలు తీసుకు వచ్చారని ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ వలన దోపిడీకి గురి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందేలా హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విస్తృతంగా అభివృద్ధి చేశారని తెలిపారు. ఎంతోమంది విద్యార్థులకు డాక్టర్ కావాలన్న కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల రాష్ట్ర విద్యార్థులు మన రాష్ట్రంలోనే చదువుకునే అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు.
















