కాలం చెల్లిన చ‌ట్టాల‌పై ఎంపీ కీల‌క కామెంట్స్

రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్–2025పై లోక్‌సభలో

hellotelugu-MPGurumurthy

న్యూఢిల్లీ : తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి లోక్ స‌భ‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం, అమల్లో ఉన్న చట్టాల్లోని సాంకేతిక లోపాలను సరిదిద్దడం లక్ష్యంగా ప్రవేశ పెట్టిన రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్–2025పై లోక్‌సభలో జ‌రిగిన చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లులో పలు సానుకూల అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2016 నుంచి 2023 మధ్యకాలంలో ఉద్దేశ్యం నెరవేరిన పలు సవరణ చట్టాలను రద్దు చేయడం ద్వారా చట్టాల భారాన్ని తగ్గించడం జరుగుతోందన్నారు గురుమూర్తి. దీని వల్ల పౌరులు, వ్యాపార సంస్థలు, న్యాయస్థానాలకు చట్టాల అర్థం మరింత స్పష్టంగా ఉండే అవకాశం కలుగుతుందని చెప్పారు. అలాగే కొన్ని కీలక చట్టాల్లో పరిమితమైన, లక్ష్య బద్ధమైన సవరణలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

జనరల్ క్లాజెస్ యాక్ట్‌లో “రిజిస్టర్డ్ పోస్ట్” స్థానంలో “స్పీడ్ పోస్ట్ విత్ రిజిస్ట్రేషన్” అనే పదాన్ని ప్రవేశపెట్టడం ఆధునిక పోస్టల్ వ్యవస్థలకు అనుగుణంగా ఉందని తెలిపారు. అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్‌లో సమన్ల జారీకి ప్రూఫ్ ఆఫ్ డెలివరీ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్ల కేసుల పరిష్కార వేగం పెరుగుతుందని ఎంపీ గురుమూర్తి స్ప‌ష్టం చేశారు . అయితే ఈ బిల్లులో కొన్ని అంశాలపై సందేహాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనేక సవరణ చట్టాలను ఒకేసారి రద్దు చేస్తూ, వాటిని సమగ్రంగా పునః ప్రకటన చేయక పోవడం వల్ల భవిష్యత్తులో న్యాయ పరమైన గందరగోళం తలెత్తే అవకాశం ఉందన్నారు. అలాగే విధాన పరమైన సవరణలు అమలు చేసే సమయంలో కింది స్థాయి న్యాయ స్థానాలు, జిల్లా పరిపాలనకు తగిన మార్గదర్శకాలు, శిక్షణ లేకపోతే ఈ మార్పుల ప్రయోజనాలు పూర్తిగా ప్రజలకు చేరవని సూచించారు.

Exit mobile version