MP Gurumoorthy : న్యూఢిల్లీ – ఆంధ్రప్రదేశ్‌లో రొయ్య సాగు రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి (MP Gurumoorthy) లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే రొయ్యలలో సుమారు 70 శాతం వరకు యునైటెడ్ స్టేట్స్‌కు ఎగుమతి అవుతోందన్నారు. ఒక్క తిరుపతి జిల్లాలో సుమారు 28 వేల ఎకరాలలో సాగు చేస్తున్నారని తెలిపారు. సంవత్సరానికి సుమారు 1.25 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోందని ఆయన వివరించారు. అయితే ఇటీవల అమెరికా ప్రభుత్వం విధించిన 50 శాతం దిగుమతి సుంకం వల్ల ఎగుమతులు ఆగి పోవడంతో 48 గంటల లోపే ధర క్వింటాల్‌కు రూ. 230 మేర క్షీణించిందని వాపోయారు. తద్వారా రైతులకు టన్నుకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు నష్టపోయినట్లు ఎంపీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు.
MP Gurumoorthy Key Comments
ఈ ధరల పతనం వల్ల రైతులు తాము పెట్టిన పెట్టుబడి ఖర్చులను తిరిగి పొందలేక పోతున్నారని, బ్యాంకులే కాకుండా ప్రైవేట్ అప్పుల్లో చిక్కుకుని తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. దీనికి తోడు, ప్రభుత్వ శీతల గిడ్డంగులు లేకపోవడం వలన రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేక తక్షణమే అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్కెట్లుగా చైనా, లోకల్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించినా, అవి రైతులకు తగిన మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యాయని గురుమూర్తి పేర్కొన్నారు.
ఈ సంక్షోభం కారణంగా వేలాది రొయ్య సాగు రైతుల జీవనాధారం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ శీతల గిడ్డంగుల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్లను పరిశీలించి రైతులకు అండగా నిలవాలని కోరారు.
Also Read : Minister N Md Farooq Alarming : హజ్ యాత్ర కోసం 2,649 దరఖాస్తులు
