హైదరాబాద్ : భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం కేటీఆర్, పార్టీని మొత్తం లాక్కోవాలని హరీష్ రావు కేసీఆర్ చావును కోరుకుంటున్నారని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు , ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఏనాడూ కేసీఆర్ చావును కోరుకోడని అన్నారు. పది మంది బాగుండాలని కోరుకునే మనసున్న మారాజు తమ సీఎం అంటూ పేర్కొన్నారు. కమీషన్ల కోసమే కృష్ణా, గోదావరి జలాలపై బిఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను కళ్ళకు కట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు వివరించారని చెప్పారు. అయినా అబద్దాలను ప్రచారం చేయడం తగదన్నారు కేటీఆర్, హరీశ్ రావులను ఉద్దేశించి చామల కిరణ్ కుమార్ రెడ్డి.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని బిఆర్ఎస్ తుంగలో తొక్కిందని ఆరోపించారు. బావా, బామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావు దొంగలుగా దొరికారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ చావు కోరుకుంటున్నారని పదేపదే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విష ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే బాగుండదని తీవ్రంగా హెచ్చరించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. బాత్రూంలో కాలు జారి కిందపడి యశోదలో చికిత్స పొందుతున్న సమయంలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించ లేదా అని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న శాసన సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి తన బాగోగుల గురించి అడిగి తెలుసు కున్నారని దానిని నాలుగు కోట్ల మంది ప్రజలు చూశారని అన్నారు ఎంపీ.















