జోగులాంబ గద్వాల జిల్లా : రాష్ట్ర సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును12 గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం పట్ల మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. స్థానికులకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేపట్టినా అవి సక్సెస్ కావని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. మొండి వైఖరిని ప్రదర్శించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కల్వకుంట్ల కవిత.
ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే ప్రభుత్వం గుర్తించిన రెడ్ జోన్ గా మార్క్ చేసిన స్థలాల్లో పర్మిషన్లు ఇవ్వాలని అన్నారు. అంతే తప్ప రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) కాల్వలతో పచ్చని పంటలు పండే పొలాల వద్ద వ్యర్థాలను వెదజల్లే ఫ్యాక్టరీని ఎలా అనుమతిస్తారని నిలదీశారు కల్వకుంట్ల కవిత. భూములు కాపాడుకోవటానికి ఆందోళన చేస్తే రైతుల మీదనే లాఠీ ఛార్జ్ చేస్తారా అని వాపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం అనుమతించ వద్దని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానిక రైతులతో కలిసి ఉద్యమిస్తామని, ఫ్యాక్టరీ రద్దు అయ్యే వరకు పోరాడుతామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.



















