చేనేత కార్మికుల‌తో స‌ర్కార్ చెలగాటం

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

hellotelugu-MLCKavitha

వ‌రంగ‌ల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో నేత‌న్న‌ల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భూదాన్ పోచంపల్లిలో స్థానిక చేనేత కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న చేనేత కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూలు సబ్సిడి, థ్రిప్ట్ స్కీం, నేతన్నకు చేయూత వంటి పథకాలను కొనసాగించకుండా నేతన్న నడ్డి విరిచింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కల్వ‌కుంట్ల క‌విత‌.

నేతన్నల‌కు రుణమాఫి కోసం 33 కోట్లు విడుదల చేశామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క పైసా కూడా మంజూరు చేసిన పాపాన పోలేద‌న్నారు. చేనేత కార్మికుడి రుణం కూడా మాఫీ చేయక పోవ‌డంతో దానిపైనే ఆధార‌ప‌డిన వారి ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ ప్రభుత్వానికి చేనేత కార్మికుల అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నూలు సబ్సిడి, థ్రిప్ట్ స్కీం, నేతన్నకు చేయూత వంటి పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, కేవ‌లం ఆచ‌ర‌ణకు నోచుకోని హామీల‌తో కాలం వెలిబుచ్చ‌డ‌మే త‌ప్పా చేసింది ఏమీ లేద‌న్నారు క‌విత‌.

Exit mobile version