ఇంటి దొంగ‌ల వ‌ల్లే కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఓడి పోయారు

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

hellotelugu-MLAMeghaReddy

వ‌న‌ప‌ర్తి జిల్లా : కాంగ్రెస్ పార్టీకి చెందిన వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా వ‌న‌ప‌ర్తి జిల్లాలో మూడు విడ‌త‌లుగా జ‌రిగిన గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థులు దారుణంగా ఓడి పోవ‌డానికి ఇంటి దొంగ‌లే కార‌ణ‌మ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వారి కార‌ణంగానే పార్టీకి భారీ ఎత్తున దెబ్బ ప‌డింద‌ని మండిప‌డ్డారు. తూడి మేఘా రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ పెద్ద మనిషి ఫోన్లు చేసి మరీ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయమని చెప్పాడని సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌త ఎన్నిక‌ల నుంచి నేటి వ‌ర‌కు వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఆధిపత్య పోరు కొన‌సాగుతోంది. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ జిల్లెల చిన్నారెడ్డిల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా త‌యారైంది.

ఇదిలా ఉండ‌గా తూడి మేఘా రెడ్డి బ‌య‌ట‌కు పేరు చెప్ప‌క పోయిన‌ప్ప‌టికీ ప‌రోక్షంగా ఆ పెద్ద మ‌నిషి ఎవ‌ర‌నేది వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థుల‌ను ద‌గ్గ‌రుండి గెలిపించారంటూ తూడి మేఘారెడ్డి ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించి త‌న వ‌ద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఇవాళ మీడియా ముందు అస‌లు వాస్త‌వాలు ఏమిటో బ‌య‌ట పెడ‌తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వనపర్తి ప్రజల ముందు ఇదంతా బయట పెడతాన‌ని, అప్పుడు వాళ్లే పనిష్మెంట్ ఇస్తారని అన్నారు తూడి మేఘా రెడ్డి.

Exit mobile version