బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. కొత్త ఏడాదిలో మరి కొంత హీట్ ను ఎక్కించేలా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు అయిన డీకే శివకుమార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన తప్పకుండా కర్ణాటకకు కాబోయే సీఎం అవుతారని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బహిరంగంగానే హుస్సేన్ ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో కలకలం రేపింది. ఇదిలా ఉండగా లింగాయత్ సామాజిక వర్గం ఎక్కువగా కర్ణాటకలో డామినేట్ చేస్తూ వస్తుంది. ఈ సామాజిక వర్గానికి చెందిన మఠాధిపతులు ప్రభుత్వాన్ని శాసిస్తారన్న ప్రచారం ఉంది. ఈ తరుణంలో వారంతా మూకుమ్మడిగా డీకే శివకుమార్ కు మద్దతు ఇస్తున్నారు.
అంతే కాదు తమ సామాజిక వర్గానికి చెందిన డీకేకు సీఎం పదవి ఇవ్వాలని ఓ స్వామీజీ ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేయడం విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే రెండు వర్గాలుగా చీలి పోయారు సీఎం, డిప్యూటీ సీఎం. ఇద్దరు పైకి నవ్వుతూ మాట్లాడినా, పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ప్రకటించినా చివరకు ఎవరికి వారు తమ లాబీయింగ్ లో నిమగ్నం అయి ఉన్నారు. ఈ తరుణంలో పుండు మీద కారం చల్లినట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హుస్సేన్ బహిరంగంగా నే ప్రకటించడం, ఆపై పక్కా డేట్ కూడా వెల్లడించడం ఆ పార్టీకి చెందిన నేతలు, శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది.

















