వరంగల్ జిల్లా : మాజీ సీఎం , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు అధికారం కుటుంబ హక్కుగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.
విపరీతమైన ధోరణితో నీచమైన విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు .ప్రజలు వాళ్ళ విమర్శలను ఓటు రూపంలో తిప్పికొట్టారని అన్నారు కడియం శ్రీహరి. అయినా బుద్ది రావడం లేదన్నారు. ప్రజలు వాళ్ళను పట్టించుకోవడం లేదనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలకు ప్రజలు బిఆర్ఎస్ కు ఓటు వేసేందుకు సిద్దంగా లేరంటూ స్పష్టం చేశారు.
జాతిపిత ఒక్కరే ఉన్నారని , ఆయనే మహాత్మా గాంధీ అని ఆ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం మానుకోవాలని సూచించారు కడియం శ్రీహరి. ఏం ఉద్దరించాడని కేసీఆర్ ను జాతిపిత అని చెప్పుకోవడనికి సిగ్గు ఉండాలన్నారు. ఏం చేశాడని ఇలా మాట్లడుతున్నారంటూ ప్రశ్నించారు . అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 2014 ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని…? ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ కేసులలో ఇరుక్కున్నారని వారు బయటకు రావడం కష్టమేనని అన్నారు.
