విశాఖపట్నం : మాజీ మంత్రి , ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేదనే అక్కసుతో లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇవాళ గంటా మీడియాతో మాట్లాడారు.
భోగాపురం విషయంలో వైసీపీ అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. ఆనాడు భూసేకరణ జరగకుండా అడ్డుపడింది ఆ పార్టీ నేతలేనని ఆయన ఆరోపించారు. అక్కడి రైతుల్ని రెచ్చగొట్టి కేసులు పెట్టించారని ఆవేదన చెందారు. భోగాపురం విమానాశ్రయం కోసం చిత్తశుద్ధితో పని చేసింది టీడీపీనేనని చెప్పారు గంటా శ్రీనివాస రావు. ఇదిలా ఉండగా ఎయిర్ పోర్టుకు కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
విశాఖ బీచ్ రోడ్డు నుంచి భోగాపురం వరకు అభివృద్ధి పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖ మెట్రో పనులు కూడా మొదలవుతాయని ప్రకటించారు. మొదటి నుంచి జగన్ రెడ్డికి అభివృద్ది అంటే పడదన్నారు. గత 5 ఏళ్ల పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడుక్కునే స్థితికి తీసుకు వచ్చాడని సంచలన ఆరోపణలు చేశారు గంటా శ్రీనివాస్ రావు. విద్య, వైద్యం, వ్యవసాయ, తదితర రంగాలన్నీ నిర్వీర్యం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజా పాలన సాగుతోందని స్పష్టం చేశారు. ఇక భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో క్రెడిట్ తను కొట్టేసేందుకు ప్రయత్నం చేయడం సిగ్గు చేటు అని అన్నారు గంటా శ్రీనివాస రావు.















