హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొలువు తీరిన ప్రజా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. సర్కార్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రంజాన్ కేవలం పండుగ కాదని, ఆత్మ శుద్ధి చేసుకునే సమయం అన్నారు సీఎం. మనుషుల మధ్య సోదరభావం, మతాల మధ్య సామరస్యం తెలంగాణ సంస్కృతి అని పేర్కొన్నారు. ఆ సంస్కృతిని అందరం కలిసి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ముస్లింల సంక్షేమం పట్ల మాకు చిత్తశుద్ధి ఉందన్నారు. భారత క్రికెట్ జట్టుకు విశిష్ట సేవలు అందించిన మొహమ్మద్ అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చామని చెప్పారు.
అంతే కాకుండా సీనియర్ నేత షబీర్ అలీ కి ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టినట్లు తెలిపారు. ఎనిమిది కార్పొరేషన్లకు మైనారిటీ నేతలను ఛైర్మన్లు చేశామన్నారు. క్రికెటర్ సిరాజ్ కు డీఎస్పీ ఉదోగ్యం ఇచ్చామని, బాక్సర్ నిక్కత్ జరీన్ కు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించామని చెప్పారు సీఎం.
ఈ ప్రభుత్వం మీది , నేను అందరివాడిని, మీ సోదరుడిని అని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని మతాలు ఐక్యంగా ఉండటమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. అందరి తోడ్పాటుతో దేశం లో తెలంగాణ ను అభివృద్ధి లో ముందు వరుసన నిలబెడతామని ప్రకటించారు.
