మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాన్స్ పోర్టు డెవలప్ మెంట్ సెంటర్ ను సందర్శించారు. మంత్రి లోకేష్ బృందానికి మాస్కో ట్రాన్స్ పోర్టు కాంప్లెక్స్ లోని సమాచార సాంకేతిక వ్యవస్థ, కమ్యూనికేషన్ డైరక్టరేట్, అటానమస్ ట్రాన్స్ పోర్టు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ విభాగాధిపతి పావెల్ బోక్షా , సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ హెడ్ ఓల్గా పిచికోవా , డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ (మాస్కో) సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అలెగ్జాండర్ సువోరోవ్ , మాస్కో ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ డైరక్టర్ జనరల్ సలహాదారు మస్తిస్లావ్ ఇసాకోవ్ ఘనస్వాగతం పలికారు.
అనంతరం యాంపి థియేటర్ లో మాస్కో అటానమస్ ట్రాన్స్ పోర్టు సెంటర్ అభివృద్ధి గురించి పావెల్ బోక్షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మాస్కో ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సెంటర్ కార్యకలాపాలు, పనితీరు గురించి మస్తిస్లావ్ ఇసాకోవ్ తెలియ జేశారు. తర్వాత పక్కనే ఉన్న అధునాతన టికెటింగ్ సిస్టమ్స్, డెవలప్ మెంట్ లేబరేటరీని లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ ఒకటిగా ఉంది. ఇది రవాణా నెట్‌వర్క్ నిర్వహణ, డిజిటలైజేషన్, ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ కలిగి ఉండడం భేష్ అన్నారు.
ఇక్కడ మెట్రో, బస్సులు, ట్రాలీలు, ఎలక్ట్రిక్ రైళ్లు, బైక్-షేరింగ్, స్కూటర్లు అన్నీ ఒకే పర్యావరణ వ్యవస్థ కిందకు తీసుకు వచ్చారు. వీటిని ప్రయాణికులు ఒకే మొబైల్ అప్లికేషన్ ద్వారా సులభంగా ఉపయోగించు కోవచ్చు. సబర్బన్ ప్రాంతాలను ప్రధాన కేంద్రంతో అనుసంధానించే అత్యాధునిక రైలు ప్రాజెక్టు మాస్కో సెంట్రల్ డయామీటర్స్ (MCD) ఇందులో అంతర్భాగంగా ఉందన్నారు. ఇది నగరంలో మెట్రో రద్దీని తగ్గించడానికి ఎంతో దోహద పడుతోంది. మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, ట్రాన్స్ పోర్ట్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్ సెంటర్లు కృత్రిమ మేధస్సు (AI) , సీసీ కెమెరాల ద్వారా నగరంలోని ట్రాఫిక్, భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడానికి ఇది సహాయ పడుతోంది. మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాన్స్ పోర్టు డెవలప్ మెంట్ సెంటర్ పనితీరు అద్భుతం అని ప్రశంసించారు. భారత్ లో కూడా ఇటువంటి వ్యవస్థలు రావాల్సి ఉందని లోకేష్ అన్నారు.
















