అమరావతి : కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే పరిధిని స్పష్టం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్బంగా సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడం ఏపీ ప్రజల చిరకాల స్వప్నం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కృషితోనే ఇది సాకారమైందని చెప్పారు. ఆయన నిరంతరం ఏపీ రాష్ట్ర అభివృద్ది గురించి ఆలోచిస్తారని చెప్పారు. ఇలాంటి నాయకుడు ఏపీకి ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు.
విశాఖ రైల్వే జోన్ కావాలని పలు మార్లు కేంద్రానికి విన్నవించడం జరిగిందన్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు వినతులు చేస్తూ వచ్చారని తెలిపారు బీసీ జనార్దన్ రెడ్డి. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కావడంతో రాష్ట్ర రవాణా రంగంలో నవశకానికి నాంది పలకనుందని అన్నారు మంత్రి. ఎన్నో ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కల నెరవేరుస్తూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావడం చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు. కొత్త జోన్ ఏర్పాటుతో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు, కొత్త రైళ్ల రాక, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
