గుంటూరు జిల్లా : వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజన, వసతి సౌకర్యాలు కల్పించేలా సంక్షేమ శాఖ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశించారు. గుంటూరు వైద్య కళాశాల ఎదుట ఉన్న ఏపీఎన్జీవో కల్యాణ మండపం లో రాష్ట్ర వెనుకబడిన తరగతులు, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఎక్స్ అఫిషియల్ సెక్రటరీ సత్యన్నారాయణ ప్రాంతీయ జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, వసతి గృహా సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వనతి గృహాల నిర్వహణ, రాబోయే టెన్త్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనపై ప్రాంతీయ జిల్లాలైన గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం, మార్కాపురం, ఎస్ పీ ఎస్ ఆర్ నెల్లూరు జిల్లాల వసతి గృహా సంక్షేమ అధికారులతో జిల్లాల వారీగా, వసతి గృహాల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో డైట్ మెనూ అమలు, మంచినీటి సరఫరా, వార్డెన్ల పనితీరుపై ఆరా తీశారు. ఇందులో భాగంగా పబ్లిక్ పెర్సెప్షన్ లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన వసతి గృహాల సంక్షేమ అధికారులు పనితీరు మార్చుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
