అమరావతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత. ముఖ్యంగా చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు, బజార్లు, వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోందని అన్నారు. పండగ సమయాల్లో భారీ డిస్కౌంట్లు అందజేస్తూ చేనేత వస్త్రాల వినియోగం పెంచడంతో పాటు నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పించడమే కాకుండా ఆదాయం ఆర్జించేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు మంత్రి ఎస్. సవిత. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అసెంబ్లీకి, శాసనమండలికి వస్తున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచే లక్ష్యంతో గురువారం నుంచి బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ ఆప్కో ఆధ్వర్యంలో 12 స్టాళ్లను చేనేత, జౌళి శాఖాధికారులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో తయారవుతున్న ప్రఖ్యాతగాంచిన చేనేత ఉత్పత్తులను ఈ స్టాళ్లలో విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారరు సవిత. పొందూరు షర్ట్ లు, పంచెలు, కండువాలు, మాధవవరం, వెంకటగిరి, ధర్మవరం, రాజమండ్రి, ఉప్పాడ, బందరు, మానపల్లి పట్టు, సాధారణ చీరలతో పాటు ఇంటిళ్లపాది వినియోగించుకునే రెడీమేడ్ దుస్తులను ఈ స్టాళ్లలో అమ్మకానికి అందుబాటులో ఉంచామన్నారు. లుంగీలు, టవళ్లు, దుప్పట్లు, ఇతర చేనేత వస్త్రాలను సైతం అమ్మకానికి పెట్టనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఏయే వస్త్రాలు విక్రయిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన చేనేత వస్త్రాలను, పట్టు చీరలను అమ్మకానికి పెట్టాలని చేనేత, జౌళి శాఖాధికారులకు మంత్రి సవిత ఆదేశించారు. చేనేత స్టాళ్లతో పాటు ఫొటో స్టాల్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.















