అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుడికట్ల పూజారులకు గౌరవ వేతనం అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఎస్.సవిత కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాయలంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. గుడికట్ల పూజారులకు సంబంధించిన సమస్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంతో మంత్రి సవిత చర్చించారు. రాష్ట్రంలో వ్యాప్తంగా 700ల వరకూ గుడికట్ల దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో ఉండే పూజారులు కురబ సామాజిక వర్గానికి చెందిన వారన్నారు. వారిని ఆదుకోవాల్సిన ఆశ్యకత ఉందన్నారు. దీనిలో భాగంగా వారికి గౌరవ వేతనం అందించాల్సి ఉందన్నారు మంత్రి సవిత.
రాష్ట్రంలో చిన్న దేవాలయాలకు గౌరవం వేతనంతో పాటు ధూప, దీప, నైవేద్యాల కింద రూ.10 వేలు అందిస్తున్నారన్నారు. వారికి మాదిరే గుడికట్ల దేవాలయాల నిర్వహణకూ రూ.10 వేలు చొప్పున అందించాలని మంత్రి సవిత కోరారు. గుడికట్ల పూజార్ల సమస్యలపై మంత్రి ఆనంకు వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సానుకూలంగా స్పందించారు. గుడికట్ల పూజార్ల సమస్యల పరిష్కారానికి అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత వెంట రాష్ట్ర కురుబల సంక్షేమ సంఘం, గుడికట్ల దేవాలయ పూజారుల ప్రతినిధులు ఉన్నారు.
