అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని క్యాంటీన్లు ప్రారంభించనున్నామని తెలిపారు. జగన్ చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో తొలగించి, రాజముద్రను ముద్రించి, రైతులకు తమ సొంత భూములపై సర్వహక్కులు కల్పించామన్నారు. విద్యుత్ ఛార్జీలను జగన్ పెంచితే, వాటిని తగ్గించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిదేనన్నారు. ఎన్నికల హామీ మేరకు మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఐదు వేల కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చామని తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని చెప్పారు.
గడచిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తోందని, రాష్ట్ర గౌరవాన్ని పెంచింది చంద్రబాబేనని మంత్రి సవిత స్పష్టం చేశారు. జగన్ రెడ్డి తన ప్రచార యావ కోసం వేట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేశారని మంత్రి సవిత మండిపడ్డారు. కుల ధ్రువీకరణ పత్రాలపైనా, సర్వే రాళ్లపైనా, విద్యార్థులకిచ్చిన స్కూల్ బ్యాగ్ లపైనా తన ఫొటో పెట్టుకున్న ఘనుడు జగన్ అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
