ఖమ్మం జిల్లా : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు.. అధికారులు సమన్వయంతో పని చేసి 99 రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరం లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. దానిలో భాగంగా నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రతి కార్యక్రమాలను అధికారులు అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు.
ప్రధానంగా పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ అలైవ్ (రోడ్డు భద్రత), సంక్షేమం, పిల్లల రక్షణ ,డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ఈ ప్రణాళికలో అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం లేకుండా అందరు భాగస్వాములు కావాలని అన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అధికారులు మరింత శ్రద్ధ వహించి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. మార్చి 12న నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్ లు, మేయర్ లు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. 99 రోజుల అభివృద్ధి ప్రణాళికలో ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఈ శిక్షణ కార్యక్రమంలో నూతన ప్రజాప్రతినిధులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
















