అమ్రాబాద్ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ

క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించిన మంత్రి కొండా సురేఖ‌

hellotelugu-KondaSurekha

హైద‌రాబాద్ : న‌ల్ల‌మ‌ల‌లోని అమ్రాబాద్ నిర్వాసితుల‌కు పున‌రావాస ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి కొండా సురేఖ‌. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. నెహ్రూ జూలాజికల్ పార్కులో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. రక్షిత అటవీ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియను కమిటీ సమీక్షించింది.

నాలుగు గ్రామాలకు చెందిన 417 కుటుంబాల పునరావాసంపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో 160 కుటుంబాలు నేరుగా నగదు పరిహారాన్ని తీసుకునేందుకు అంగీకరించగా, ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షలు వారి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు అధికారులు వివరించారు. మిగిలిన 257 కుటుంబాలకు బాచారం వద్ద ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములతో కూడిన పునరావాస ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏటూరు నాగారం అభయారణ్యంలో రెండు రహదారి ప్రాజెక్టులకు కమిటీ సిఫార్సు చేసిందన్నారు. నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలోని డిండి బాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి అటవీ భూమి వినియోగానికి అనుమతి ఇవ్వ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు మంత్రి కొండా సురేఖ‌. కవాల్ టైగర్ రిజర్వ్, ప్రాణహిత అభయారణ్యం పరిధిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించారు.

Exit mobile version