ఘాట్ల నిర్మాణం, రోడ్ల అభివృద్దిపై దృష్టి సారించాలి

స్ప‌ష్టం చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

hellotelugu-KomativenkatReddy

హైద‌రాబాద్ : తెలంగాణ గంగానదిగా భావించే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై కీలక చర్చలు జరిగాయి. ఈ ఏడాది జూన్ 26 నుండి జూలై 7 వరకు జరిగే ఈ ఆది పుష్కరాలకు కోట్ల సంఖ్యలో భ‌క్తులు తరలివచ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇందుకు గాను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఈ పుష్కరాల ఏర్పాట్లలో త‌మ‌ శాఖ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. కందకుర్తి నుండి భద్రాచలం వరకు ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలైన బాసర ,ధర్మపురి , మంథని , కాళేశ్వరం ప్రాంతాల్లో ఘాట్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని, ఇప్ప‌టికే యాక్ష‌న్ ప్లాన్ రూపొందించిన‌ట్లు తెలిపారు. హ్యామ్ మోడల్ రోడ్ల కనెక్టివిటీతో పాటు భక్తుల రద్దీని తట్టుకునేలా కాంక్రీట్ రోడ్లు పార్కింగ్ సౌకర్యాలతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ , ఇతర విభాగాల సమన్వయంతో తదుపరి సమావేశం నాటికి పూర్తి స్థాయి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మికతకు, టెంపుల్ టూరిజానికి పెద్దపీట వేస్తూ భక్తులందరికీ క్షేమకరమైన పుష్కర స్నానానుభూతిని అందించడమే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ పాల్గొన్నారు.

Exit mobile version