హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ మీటింగ్ 2025–26 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిర్మాణ రంగం అంటే కేవలం కాంట్రాక్ట్ కాదని అన్నారు. అది రాష్ట్ర నిర్మాణంలో ఒక భాగమని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజన్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని మౌలిక వసతుల పరంగా మరింత బలంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇందులో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు మంత్రి. కొందరు కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అయినా ఎక్కడా పనుల ప్రగతి విషయంలో ఆగడం లేదన్నారు. ఇప్పటి వరకు రోడ్లు, భవనాల శాఖ పరిధిలో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రీజినల్ రింగ్ రోడ్, హైవేల విస్తరణ, ఫ్లైఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు వంటి బృహత్తర పనులు రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కల్పిస్తాయని అన్నారు. మంచి రోడ్డు కనెక్టివిటీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రభుత్వం, కాంట్రాక్టర్లు ఒక టీమ్‌గా పనిచేస్తేనే తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మనమందరం కలిసి రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, స్థిరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామన్నారు.
