విజయవాడ : ఏపీ రాష్ట్రానికి ఆశించిన దానికంటే అధికంగా రూ. 8.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. లక్ష్యాలు లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, జగన్ రెడ్డికి నచ్చిన విధంగా పాలన చేశాడంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం గురించి ఆలోచించ లేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎంత బాధ్యతా యుతంగా నిర్వహించారో అందరికీ తెలుసు అంటూ ఎద్దేవా చేశారు పార్థసారథి. ప్రచారానికి మూడు రాజధానులను వాడుకున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం 31 శాతం ఎక్కువ అప్పులు తీసుకున్నారని కాగ్ చెప్పిందన్నారు మంత్రి. ఇరిగేషన్ కు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అయిదు సంవత్సరాలు పరిపాలించారని ఆరోపించారు. బాబు
ప్రారంభించారన్న ఒకే ఒక్క కారణంతో కొన్ని ప్రాజెక్టులను కావాలని నిలిపి వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చాక ఏకంగా 50 వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ పెన్షన్ కు ఖర్చు చేశామన్నారు కొలుసు పార్థసారథి. ఇప్పటి వరకు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని, ఇంకా వస్తున్నాయని చెప్పారు. సర్కార్ తీసుకు వచ్చిన 25 పాలసీలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళకుండానే ప్రభుత్వ సేవలను ఉపయోగించుకునేలా వాట్సాప్ ఈ గవర్నర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా లేకుండా.. అసెంబ్లీకి రాకుండా వన్ సైడ్ గా జగన్ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు. పీపీపీ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు కొలుసు పార్థసారథి.
