Kandula Durgesh : అమరావతి – ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొని కోట కట్టుకున్న మహానటుడు కోట శ్రీనివాసరావు అని కొనియాడారు. ఆయన మృతితో గొప్ప నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయిందన్నారు. కోట మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
Minister Kandula Durgesh Comments
విలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నటుడు అని పేర్కొన్నారు కందుల దుర్గేష్. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేసిన నటుడు కోట శ్రీనివాసరావు అని పేర్కొన్నారు.
నటనా పరంగా తెలుగునాట చెరిగిపోని ముద్ర కోట శ్రీనివాసరావుదని అన్నారు కందుల దుర్గేష్. ఆయన నటన చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడిగా, తెలుగు రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా రాణించారని గుర్తు చేశారు. తమిళం, కన్నడం, హిందీ, మళయాలం తదితర భాషల్లో నటించి నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో పోషించిన ప్రతి పాత్రకు న్యాయం చేసిన గొప్ప నటుడంటూ ప్రశంసలు కురిపించారు.
కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆయన నటించి మెప్పించి నంది, సైమా వంటి ఎన్నో సినీ అవార్డులు అందుకున్నారని అన్నారు.
Also Read : Popular Writer Siddareddy : చెత్త పలుకులతో చరిత్రను మార్చలేరు – సిద్దారెడ్డి

















