అమరావతి : ఏపీ పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగంలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ గా మారుస్తామని ప్రకటించారు. ఇవాళ సచివాలయంలో పర్యాటక శాఖ అధికారులతో నిర్వహించిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి దేశీయ-అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం అన్నారు. 30 అంశాలతో కూడిన అజెండాపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ప్రచారం, మార్కెటింగ్, ఈవెంట్స్, ఉత్సవాలు, డిజిటల్ క్యాంపెయిన్లు, అడ్వర్టైజింగ్ వ్యూహాలపై అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు మంత్రి కందుల దుర్గేష్.
తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మందికి చేరుకునేలా సోషల్ మీడియా ప్రచారాలను మరింత బలోపేతం చేయాలని అన్నారు. రాష్ట్ర పర్యాటక ప్రదేశాల విశిష్టతను చాటిచెప్పే డిజిటల్ కంటెంట్, ప్రమోషనల్ వీడియోలను విస్తృతంగా విడుదల చేయాలని స్పష్టం చేశారు. పర్యాటకులకు అందుబాటులో ఉన్న వసతులపై స్పష్టమైన సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2026 మార్చిలో జర్మనీలో జరిగే ‘ITB Berlin’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రతిష్టను ప్రపంచ వేదికపై మరింతగా చాటి చెప్పేలా పకడ్బందీగా సిద్ధం కావాలని అన్నారు. గత సదస్సులో లభించిన అద్భుత స్పందనను మరింతగా అభివృద్ధి దిశగా మలచాలని పేర్కొన్నారు.














